top of page

Sreem Aparna శ్రీం అపర్ణ

 "ప్రతీ మనిషి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన భాగం. జ్యోతిషశాస్త్రం, గ్రహానుకూలతను ఆధారంగా చేసుకుని జాతకుని యొక్క జాతకంలో తద్వారా జీవితంలో వివాహపొంతన, వివాహయోగం, వైవాహికజీవితం ఎలా ఉంటాయి అనేది బేరేజు వేస్తుంది. ఈ వివాహవిషయంలో శుక్రుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలు ప్రముఖపాత్రను పోషించినా, కుజుడు కూడా జాతకచక్రంలో ఉండకూడని ఇళ్లలో ఉండకూడదు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కాని పక్షంలో జాతకంలో కుజదోషాన్ని అంచనా వేస్తారు. కుజదోషం ఉన్నవారిలో వివాహం ఆలస్యం కావడం, ఒకవేళ తొందరగా వివాహమైనా తరువాత వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు రావడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాము.

మరి ఈ కుజదోషమన్నది ఒక్క మానవులకేనా? ఎవరైనా దేవతలు కూడా ఈ దోషం బారిన పడ్డారా? ఒకవేళ ఈ దోషం బారిన పడితే వారికెలా దోష నివృత్తి అయ్యింది? అసలు ఈ కుజుఁడెవరు? అన్న సందేహాలు మనకు వస్తాయి. ఇందుకు అపర్ణ అమ్మవారి వివాహ వృత్తాంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి పుణ్యక్షేత్రమందు ప్రత్యేక తపో భంగిమలో కొలువై ఉన్న ఈ అమ్మవారి కళ్యాణం ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమీ తిథి (ఈ సంవత్సరం ఈ మార్చి నెల 9వ తారీఖున) యందు వైభవోపేతంగా జరుగు శుభ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మన అందరికోసం..."

తూర్పుగోదావరి జిల్లాలో  తాటిపర్తి ఒక కుగ్రామం. చేనేత ప్రధాన వృత్తిగా నడిచే ఈ ఊరిలో వైదిక బ్రాహ్మణ వంశీయులైన ఆకొండి వారు పూజనీయులు. శ్రీ ఆకొండి భాస్కరరావు గారు, పూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన శ్రీ ఆకొండి వేంకటేశ్వర శర్మ గారు చిన్నతనంలో తండ్రిగారి ఆజ్ఞానుసారం వేదం, వైదీకం, స్మార్తం, జ్యోతిషాది వివిధ దైవిక విద్యలను గురుకులములలో అభ్యసించి ఒక యువకుడిగా తాటిపర్తి తిరిగి వచ్చారు.

 

ఈయన జ్యోతిషంలో మంచి ప్రవేశము కలిగియిండడాన్ని తెలుసుకున్న ఊరి ప్రజలు, బంధువులు వారి వారి సమస్యలతో శర్మ గార్ని సంప్రదించడం, నివృత్తి పొందడం జరుగుతోంది. వీటిలో ఒకరోజు దగ్గర బంధువులలో ఒక అమ్మాయికి కుజ దోషంనకు సంబంధించిన జాతకం వచ్చింది. అవి వారు జాతకములు పరిశీలిస్తున్న తొలిరోజులు. ఆ జాతకంలో కుజదోషంను గుర్తించి, దోష నివారణకు ఏమి తెలియచేయాలో ఆలోచిస్తూ కుజదోష సంబంధమైన, పురాణాంతర్గతమైన అపర్ణ అమ్మవారి కథను తెలియచేసే తపో భంగిమను స్నేహితునితో చిత్రం  గీయించి, పూజావిధివిధానమును, కథావృత్తాంతమును తెలియచేసి పూజ చేయించడం, ఆ అమ్మాయికి తొందర్లోనే వివాహమై, సుఖ జీవనం సాగిస్తుండడం జరిగింది. ఇదే విధంగా మరికొన్ని కుజ దోష సంబంధించిన జాతకులకు ఈ అమ్మ వారి చిత్రం ఇచ్చి, పూజ పద్దతి తెలియచేయడం, ఈ విధంగా పూజించిన వారికీ శీఘ్రగతిన వివాహములు కావడం జరిగింది. 

ఒక్క కుజ దోష నివారణకు మాత్రమే కాకుండా వివిధ జీవిత, జాతక సమస్యల నివారణార్ధం కూడా ఈ పూజావిధానమును అవలంబించిన వారికి ఆ సమస్యలనుండి బయటపడడం జరగడంతో, వేంకటేశ్వర శర్మ గారు ఒక మంచి ఆలోచనతో అప్పటికే కొన్ని సంవత్సరాలకు ముందు ప్రారంభమై మధ్యలో వదిలివేసిన శివాలయాన్ని, శివ పంచాయతన క్షేత్రంగా పూర్తిచేయ సంకల్పించి, అమ్మవారి రూపంలో అపర్ణ అమ్మ వారిని ప్రతిష్ట చేయాలని దృష్టిలో ఉంచుకుని ఊరి పెద్దలను సంప్రదించారు.

అమ్మ వారి అనుగ్రహం, ఊరి ప్రజల సహకారంతో శివ పంచాయతన దేవాలయం 2000వ సంవత్సరంలో పూర్తి కావడం, అందు నాగేశ్వర స్వామి, సూర్యనారాయణ మూర్తి, విఘ్నేశ్వరుడు, అపర్ణ అమ్మ వారు, లక్ష్మీహయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగాయి. ఆనాటి నుండీ ఆ ఊరు ఒక ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒక్క వివాహము ఆలస్యమైన వారే కాకుండా జీవితంలో వివిధ సమస్యలతో బాధపడుతున్నవారు ముఖ్యంగా వ్యాపారంలో నష్టపోతున్నవారు, ఉద్యోగార్ధులు, ఎన్నికలలో నెగ్గాలకునే రాజకీయనాయకులు, సినీప్రముఖులు, కళాకారులు ఒక్కరేమిటి ఎవరెవరు వారి వారి రంగాలలో విజయం సాధించాలని కోరుకుంటారో వారందరూ అమ్మ వారిని దర్శనం చేసుకుని, అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న పనులలో విజయులు అవుతున్నారు.

ఇక క్లుప్తంగా ఈ క్షేత్ర కథ విషయానికి వస్తే, శివుని అర్థాంగి దాక్షాయణి, పిలవని పేరంటానికి తండ్రి దక్షుని ఇంట నిరీశ్వర యాగానికి వెళ్ళింది. అక్కడ తండ్రి నోటివెంట తన భర్తపై శివ నింద భరించలేని ఆ తల్లి యోగాగ్నికి ఆహుతి అయ్యింది. విషయం తెలుసుకున్న శివుడు క్రోధాగ్నితో ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. సతీవియోగాన్ని సహించలేని శివుని రౌద్రవ తాండవ సమయాన లలాట భాగము నుండి భూమిపై పడిన శ్వేదబిందువు నుండి ఒక శిశువు జన్మించాడు. పుట్టిన మరుక్షణం దిక్కులు పిక్కటిల్లేలా ఏడవడం ప్రారంభించిన ఆ శిశువుకు భూమాత వచ్చి స్తన్యమిచ్చి శాంతింపచేసింది. శివుడు ఆనందించి భూదేవికి ఆ బిడ్డను ఇచ్చి నీవు పుణ్యాత్మురాలవు, నా శ్వేదబిందువు నీపై పడి నీనుండి పుట్టినాడు గాన నీ కుమారునిగా, భౌమ్యుడుగా ప్రసిద్ధికెక్కుతాడు, ఇక నుండి నీవు పెంచి పెద్దచేయమని చెప్పెను.  కు-భూమి యందు, జ-జన్మించినవాడు కాన కుజుడను నామంతో ఆ బాలుడు పిలువబడి కాశీ క్షేత్రమందు విశేషమైన తపమాచరించి ముఖ్యమైన నవ గ్రహములలో ఒక గ్రహముగా భాసిల్లుతున్నాడు, పూజింపబడుతున్నాడు. ఎవరైతే ఈ కుజ జన్మవృత్తాంతమును తెలుసుకుని కుజుని భక్తితో పూజిస్తారో వారికి కుజదోష నివృత్తి జరిగి సర్వ కామ్యములు సిద్ధిస్తాయి.

 

ఇక సతీవియోగానంతరం, పరమశివుడు ఖిన్నుడై కైలాసమున తపమున మునిగిపోయెను. దక్షుని కుమార్తెగా తనువు చాలించిన శివసతి, పర్వతరాజైన హిమవంతుని కుమార్తెగా జన్మించి హైమావతి, పార్వతిగా పిలవబడెను. ఆమె పెరిగి పెద్దదవుతున్న సమయాన తారకాసురుడనే రాక్షసుడు కఠోర తపమాచరించి బ్రహ్మ గారిచే అనేక వరములను పొంది దేవతలను యుద్ధమునందు ఓడించి ఇంద్రుని పదవీ భ్రష్ఠుని చేసెను. అపుడు దేవతలు బ్రహ్మ గారి వద్దకు పోయి తమ గోడు విన్నవించుకోగా- నేనుకాని, హరిహరులు కానీ ఆ రాక్షసుని ఏమీ చేయజాలమని, ప్రస్తుతం హిమవంతుని ఇంట పరమేశ్వరీదేవి పెరిగి పెద్దదవుతున్నదని, ఆమెను పరమశివుడు వివాహమాడితే, వారికి పుట్టబోయేబిడ్డ తారకాసంహారం చేయగలడనే ఉపాయాన్ని బ్రహ్మ గారు సెలవిచ్చారు.

 

ఇంద్రాది దేవతలు పార్వతీపరమేశ్వరుల కళ్యాణమెట్లో అని  ఆలోచించుచుండగా, నారదుని  ఆదేశానుసారం తన బిడ్డ జగజ్జననిగా గుర్తించి, శివుని ఇల్లాలవుతుందని గ్రహించి హిమవంతుడు తన పర్వత సానువులలో తపమాచరించుచున్న శివుని సేవకై తన కుమార్తె హైమవతిని నియోగించెను. ఘోరతపము చేయుచున్న శివునికి ఇవేమీ పట్టవాయెను. శివుని దృష్టి తనపై సోకని పార్వతి అమ్మవారు నిరంతర సేవలలో నిమగ్నమై ఉన్ననూ చిన్నబోతుండెను.  

ఇదే అదనుగా భావించిన ఇంద్రాది దేవతలు, మన్మథుని శివుని తపోభంగము కావించడం కొరకు పంపగా, రతీదేవి చెబుతున్నా, తప్పని తెలిసినా ఇంద్రుని మాట కాదనలేని మన్మథుడు వసంతుడు వెంటరాగా శివుడు తపమాచరించుచున్న ప్రదేశమునకు పోయి, కామ వికారం కలిగేటట్లు శివునిపై పుష్పబాణం వేశాడు. తనలో కలిగిన మార్పుని గుర్తించిన శివుడు జరిగిన విషయం తెలుసుకుని ఉగ్రుడై మూడవకంటితో మన్మథుని భస్మం కావించెను. అక్కడ నుండి లేచి మరుదిక్కుగా తపమాచరించుటకు శివుడు వెడలిపోయెను. రతీదేవి భర్తవియోగంతో శోకసంద్రమున మునిగిపోయెను. పార్వతీ అమ్మవారు హతాశురాలై, బాధతో ఇంటికి పోయి శివుని పొందుటకు తపమాచరించవలెనని నిశ్చయుంచుకొనెను.

కథ మొదటికి వచ్చిందని గ్రహించిన ఇంద్రాది దేవతలు తలలు పట్టుకుని కూర్చుండిపోయెను. పార్వతి అమ్మ వారి తల్లి మేనక, తమను వదలి వెళ్ళవలదని, తపము వలదు సుమా... 'ఉమా' అని వారి బిడ్డను వేడుకొనెను. ఆనాటి నుండి అమ్మవారికి "ఉమ" నామము వచ్చెను. 

పట్టు వస్త్రములను వదలి, నారచీరను ధరించి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను విడనాడి రుద్రాక్షమాలలను ధరించి అమ్మవారు హిమాలయపర్వతములపై తపస్సునారంభించెను. ముందుగా ఆహారమును మాని, తరువాత ఫలములను కూడా స్వీకరించక తపమాచరించెను. అయినను శివుని అనుగ్రహం పొందని హైమావతి, ఆకులు అలములు సైతం తోసిరాదని పంచాగ్నుల మద్య కుడికాలిని ఎడమ కాలిపై మడచి, కేవలం ఎడమ కాలి బ్రొటనవేలిపై నిల్చుని ఘోర తపమును మొదలిడెను. ఇంద్రాది దేవతలు, ఋషులు, మునులు అమ్మను "అపర్ణా.. అపర్ణా..." అని సంభోదించారు. పర్ణములు అంటే ఆకులు. పర్ణములు కూడా తినకుండా తపస్సుచేసిన తల్లిని అపర్ణా అని పిలిచి తన్మయులయ్యారు.

 

అప్పుడామె తపస్సుకు శివుడు మెచ్చాడు. బ్రహ్మచారి రూపంలో ఆమెవద్దకు పోయి తల్లిదండ్రులు లేనివాడు, స్మశానవాసి, భస్మధారి అయిన శివుడెందుకు? తపస్సు వద్దని వారించాడు. శివనిందను భరించజాలని పార్వతి కోపంతో చూస్తూ ఆ ప్రదేశము వదలి పోవ, శివుడు ప్రత్యక్షమాయెను. తన తపస్సు ఫలించినందుకు పార్వతి ఎంతో మురిసిపోయింది. కృతజ్ఞతతో స్తుతి చేస్తూ, వివాహ ప్రస్తావన తెచ్చిన శివుని తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పి సిగ్గుల మొగ్గై అక్కడనుండి వారింటికి చెలికత్తెలతో పరుగు పరుగున పోయింది.

బ్రహ్మగారు, విష్ణువు సంతోషించారు. ఇంద్రాది దేవతల ఆనందానికి హద్దులు లేవు. అరుంథతి, సప్తఋషులను శివుడు రాయభారము పంపడం, మేనకాహిమవంతులు తమ జన్మ థన్యమైనదనుకుని శివపార్వతుల కళ్యాణం విష్ణువు, ఇంద్రాదిదేవతలు, సర్వ ఋషులు, మునుల సమక్షంలో బ్రహ్మగారి పౌరహత్యంలో ఎంతో వైభవంగా జరిపించడం జరిగింది. రతీదేవికి మన్మథుడు కనిపించే విధముగా వరములివ్వబడ్డాయి.

 

ఆతరువాత, శివపార్వతులకు కుమారస్వామి జననం కలిగి తారకాసుర సంహారం జరిగి లోకాలన్నీ ఊపిరితీసుకున్నాయి.

మరి జగజ్జనని, ఆదిపరాశక్తి అయిన అమ్మవారికి కూడా ఆమె వివాహవిషయంలో ఇన్ని కష్టాలా? ఇన్ని తపస్సులా? దానికి మూలకారణం అమ్మకు జాతకరీత్యా కుజదోషం ఉండడమే. అమ్మ సమర్థురాలు ఆమె తపములాచరించి కుజదోషం బాపుకుని శివునికి ఇల్లాలు కాగలిగింది. మరి సామాన్యుల మాటేమిటి? అంటే అమ్మ ఒకవరమును ఇచ్చింది - "ఎవరైతే అమ్మవారిని పూజించి, కుజ జననమునకు సంబంధించి అపర్ణా కళ్యాణము యొక్క ఈ వ్రతకథను భక్తితో వింటారో (లేక) చదువుతారో వారికి కుజదోషము సమూలంగా నివారింపబడి వివాహమవడమే కాకుండా, వైవాహిక జీవితం బాగుండి పుత్రపౌత్రాదులతో, కోరిన కోరికలు తీరి సుఖఃసంతోషములను పొందుతారు".

అపర్ణ - అప గత ఋణ  అపర్ణ అనగా ఋణములను పోగొట్టునది.

తాటిపర్తి - మరెక్కడా లేని విధంగా ఎడమకాలి బ్రొటనవేలిపై తపోభంగిమలో నిలబడి, రెండు చేతులు తలపై నమస్కారముద్రలో ఉన్న మూల విరాట్టు అమ్మ వారి దివ్య క్షేత్రము - తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు 30కి.మీ దూరంలో, సామర్లకోటకు 30కి.మీ దూరంలో, కత్తిపూడికి 15కి.మీ దూరంలో, మండలకేంద్రమైన గొల్లప్రోలుకు 5కి.మీ దూరంలో ఉన్నది. తాటిపర్తి చిరకాలంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి స్వయంభువు క్షేత్రం. అక్కడ ఉన్న కోనేటి నుండి స్వయంగా సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో గుడిలోనికి ప్రవేశించి పూజలందుకుంటారు. శివపంచాయతన క్షేత్రములో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కార్తీకమాసం, సుబ్రహ్మణ్య షష్టికి, ప్రతీ మంగళ, శుక్రవారములు విశేషపూజలు, హోమములు జరుగుతాయి. ప్రతీ యేటా ఫాల్గుణ శుద్ధ సప్తమికి జరిగే అమ్మ వారి కళ్యాణం 5 రోజులు వివిధ కార్యక్రమములు, కుంకుమపూజలు, అన్న సంతర్పణలు  జరుగుతాయి. పెద్ద సంఖ్యలో జనం విచ్ఛేసి అమ్మవారిని అర్చించి తరిస్తారు. ఉదయం 6గం. నుండి 12గం. వరకు, సాయంత్రం 4గం. నుండి 8గం.30ని. వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మరిన్ని విషయాలకు యూట్యూబ్ లో ఆలయమునకు సంబంధించి వీడియోలు, లేదా www.sreemaparna.com ను సంప్రదించవచ్చు.

 

  

flower_center_border_edited.png

అపర్ణ

bottom of page